ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్న..మహిళలంటే నాకు గౌరవం : స్పీకర్ గడ్డం ప్రసాద్

ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్న..మహిళలంటే నాకు గౌరవం : స్పీకర్ గడ్డం ప్రసాద్
  • నాకు 8 మంది అక్కాచెల్లెళ్లు: స్పీకర్ గడ్డం ప్రసాద్

హైదరాబాద్, వెలుగు: మహిళలంటే తనకు గౌరవం ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. తనకూ ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంగళవారం ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పారు. సోమవారం పద్దులపై చర్చ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా.. స్పీకర్ మైక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె ఏదో మాట్లాడుతుండగా.. ‘‘నాకే వినాలనిపిస్తలేదు.. వేరేవాళ్లు ఇంకెట్లా వింటున్నారో’’ అంటూ స్పీకర్​ వ్యాఖ్యానించారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే సునీతా లక్ష్మారెడ్డి.. స్పీకర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. స్పీకర్ వ్యాఖ్యలతో తాను బాధపడ్డానన్నారు. తాను సబ్జెక్ట్​ను ఎక్కడా డీవియేట్ కాలేదన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను ఎప్పుడూ మీరలేదని వివరించారు.

గతంలో సీఎం తమను అవమానించినప్పుడు కూడా మౌనంగా నిలబడి నిరసన తెలిపామే తప్ప అనుచితంగా ప్రవర్తించలేదన్నారు. ఆ వ్యాఖ్యలను సవరించుకోవడంపై స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆమె అన్నారు. దీనికి స్పందించిన స్పీకర్.. మహిళలంటే తనకు గౌరవమన్నారు. తన మాటలు బాధించి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు.

కోనో కార్పస్ చెట్లు తొలగించండి

కార్బన్ డై ఆక్సైడ్ వెదజల్లుతున్న కోనో కార్పస్ చెట్లను తొలగించాలని ప్రభుత్వానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. బుధవారం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో స్పీకర్ మాట్లాడారు. గత ప్రభుత్వం హరిత హారం లో భాగంగా పెద్ద సంఖ్యలో కోనో కార్పస్​ ​మొక్కలు నాటిందని, వీటి మీద  పిట్టలు కూడా వాలడం లేదని తెలిపారు.

ఈ చెట్లు ఆక్సిజన్ ను ఎక్కువగా తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయని, అందువల్ల వీటితో పర్యావరణానికి నష్టం జరుగుతుందని స్పీకర్ చెప్పారు. హరిత హారంలో భాగంగా రాష్ట్రంలో 200 కోట్లకు పైగా మొక్కలు నాటామని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్తున్న టైంలో  స్పీకర్ జోక్యం చేసుకొని మాట్లాడారు.